Sakshi News home page

దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం - కోబ్రాపోస్ట్‌

Published Tue, Jan 29 2019 6:28 PM

The Anatomy of India  Biggest Financial Scam-cobrapost  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కాం అంటూ కోబ్రాపోస్ట్‌ బాంబు పేల్చింది. దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(డిహెచ్ఎఫ్ఎల్) రూ.31వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని  కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్‌లో మంగళవారం ప్రకటించింది. ఈ స్కాంకు సంబంధించిన ఆధారాలను కూడా కోబ్రాపోస్ట్ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

కోబ్రా పోస్ట్‌ అందించిన సమాచారం ప్రకారం షెల్ (డొల్ల) కంపెనీల నెట్వర్క్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు  మురికివాడల అభివృద్ధి పేరుతో అక్రమపద్ధతిలో వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. తద్వారా భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని ట్వీట్‌ చేసింది. ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్  ప్రమోటర్లకు ఒకే అడ్రస్‌తో ఉన్న అనేక షెల్‌ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే షెల్ కంపెనీలకు భారీగా రుణాలిచ్చింది. రూ.21,477 కోట్ల డిహెచ్ఎఫ్ఎల్ నిధులను వివిధ షెల్ కంపెనీలకు రుణాలుగా, పెట్టుబడులుగా అందించారని, డిహెచ్ఎఫ్ఎల్ ప్రోత్సాహక కంపెనీలకు రూ .31,000 కోట్లు చెల్లించారని  ఆరోపించింది.

మహారాష్ట్రలో మురికివాడల అభివృద్ధి పేరుతో ఈ షెల్‌ కంపెనీలకు వేలకోట్ల రూపాయలను సంస్థ కట్టబెట్టిందనీ ఆరోపించింది. ఇలా దాదాపు 45 కంపెనీలున్నాయని ఇందులో 34 సంస్థలకు వాద్వాన్ ఫ్యామిలీతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి వున్నాయని కూడా కోబ్రా పోస్ట్‌ ఆరోపించింది. అంతేకాదు ఈ రుణాలకు  సంబంధిందించిన వివరాలను  కంపెనీ ఆర్థిక రిపోర్టుల్లో పొందుపర్చలేదని పేర్కొంది. ఇలా అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో  ప్రమోటర్లు విదేశాల్లో సొంత ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లను కొన్నారని తెలిపింది.

డిహెచ్ఎఫ్ఎల్ ముఖ్య ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ సహా పలువురికి ఇంగ‍్లండ్‌, దుబాయ్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో వ్యక్తిగతంగా ఆస్తులు కూడ బెట్టుకున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెబీ, ఐటీ, నల్లధనం, మనీ లాండరింగ్‌ చట్టం, కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీపై తక్షణమే విచారణ చెపట్టాలని కోరింది. దీంతోపాటు బీజీపీకి కోట్ల రూపాయల చందాలిచ్చిందని కోబ్రా పోస్ట్‌ ఆరోపించడం గమనార్హం.

ఈ వార్తలతో డిహెచ్ఎఫ్ఎల్‌ షేరు ఇవాల్టి మార్కెట్‌లో దాదాపు 10శాతానికి పైగా నష్టపోయింది. అయితే చివర్లో తేరుకుని 5శాతం నష్టాలకు పరిమితమైంది. మరోవైపు ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న సంస్థకు తాజా ఆరోపణలు మరింత  ప్రతికూలమని ఎనలిస్టులు చెబుతున్నారు. 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement